బహుళార్థ సాధక ప్రాజెక్టు,రాష్ట్రానికి వరప్రసాదిని అయిన పోలవరం ప్రాజెక్టుపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ధ్వజ మెత్తారు. శుక్రవారం తులసి రెడ్డి వేంపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్ అవార్డు, కేంద్ర జల సంఘం,విభజన చట్టం పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45. 72 మీటర్లుగా అనగా 150 అడుగులుగా నిర్ణయించి అనుమతించాయి.
అంత ఎత్తులో నిర్మిస్తేనే 194.60 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది.అంత ఎత్తులో నిర్మించి నీటి నిల్వ చేయాలంటే ప్రస్తుత అంచనాల ప్రకారం 62,436 కోట్ల రూపాయలు కావాలి.ఆ ఎత్తులో నిర్మించి నీరు నిల్వ చేస్తేనే పోలవరం ప్రాజెక్ట్ బహుళార్థ సాధక ప్రాజెక్టు అనిపించుకుంటుందని తులసి రెడ్డి అన్నారు.ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి కృష్ణాజిల్లాల్లో 7.2 0 లక్షల ఎకరాలలో కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నా,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి జిల్లాల్లో 10.13 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేయాలన్నా, 540 గ్రామాలలో 28.5 లక్షల మందికి త్రా గునీరు అందించాలన్నా, విశాఖపట్నంకి త్రాగునీరు, విశాఖ ఉక్కు కర్మగారానికి నీరు అందించాలన్నా, 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నా, కుడికాలువ ద్వారా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేసి 80 టీఎంసీలు గోదావరి జిల్లాలు కృష్ణా డెల్టాకు మళ్లించాలన్నా పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్లు అనగా 15 0అడుగుల ఎత్తులో నిర్మించి నీరు నిల్వ చేస్తేనే సాధ్యమవుతుంది.అప్పుడే అది గ్రావిటీ ప్రాజెక్టు అవుతుంది. అంతే తప్ప 41. 15 మీటర్లు ఎత్తు అనగా 135అడుగుల ఎత్తు వరకే నిర్మించి నీరు నిలువ చేస్తే 119 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంటుందని, పై లక్ష్యాలు నెరవేరవని, కేవలం ఎత్తిపోతల ప్రాజెక్టుగా తయారవుతుందని తులసి రెడ్డి వివరించారు.
పోలవరం ప్రాజెక్టుకు 41.15 మీటర్ల ఎత్తు వరకే నీరు నిలువ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని శుక్రవారం లోక్సభలో కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.45.72 మీటర్ల ఎత్తులో పూర్తిస్థాయిలో నిర్మించి నీటి నీరు నిలవ చేయాలంటే అదనంగా 32 వేల కోట్ల రూపాయలు భూసేకరణకు,పునరావాసానికి కావాలి . ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మొదటి దశ అంటూ 41. 15 మీటర్ల ఎత్తు వరకే ఆమోదం తెలిపింది.బచావత్ ట్రిబ్యునల్,విభజన చట్టం, కేంద్ర జల సంఘం అనుమతి ప్రకారంగా 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించి నీటిని నిల్వ చేయాలని తులసి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం,మిగతా ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తులసి రెడ్డి విజ్ఞప్తి చేశారు.
