అధిక రక్తపోటు (హై బిపి) నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య. దీనిని వైద్య పరిభాషలో ‘సైలెంట్ కిల్లర్’ (నిశ్శబ్ద హంతకి) అని పిలుస్తారు. దీనికి కారణం, శరీరంలో బిపి తీవ్రంగా పెరిగే వరకు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడమే. బిపి గురించిన ముఖ్యమైన విషయాలు , దానిని అదుపులో ఉంచుకోవడానికి పాటించాల్సిన జాగ్రత్తలను గురించి తెలుసుకుందాం.
బిపి ఎందుకు ప్రమాదకరం?
రక్తపోటు సరిగ్గా అదుపులో లేకపోతే గుండెపోటు (హార్ట్ అటాక్), పక్షవాతం (స్ట్రోక్), కిడ్నీల వైఫల్యం , కంటి చూపు కోల్పోవడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ క్రమం తప్పకుండా బిపి చెక్ చేయించుకోవడం చాలా అవసరం.
బీపీ కంట్రోల్ లో ఉంచడానికి ప్రధాన సూచనలు
ఉప్పు వినియోగం తగ్గించడం: రోజూవారీ ఆహారంలో ఉప్పు (సోడియం) వినియోగాన్ని పరిమితం చేయాలి. పచ్చళ్ళు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చిప్స్ తో పాటు అప్పడాల వంటి అధిక ఉప్పు ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి.
క్రమబద్ధమైన వ్యాయామం: రోజుకి కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండి, బిపి అదుపులో ఉంటుంది.
మానసిక ఒత్తిడి: ఊబకాయం బిపిని పెంచుతుంది. తగినంత బరువు నిర్వహించడం మరియు ధ్యానం (మెడిటేషన్) ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం శ్రేయస్కరం.
సమతుల్య ఆహారం: పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మరియు పప్పు ధాన్యాలు ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
వైద్యుల సలహా – మందులు: బిపి మందులను సొంత నిర్ణయంతో ఆపడం కానీ, డోస్ మార్చడం కానీ చేయకూడదు. డాక్టర్ సూచించిన సమయానికి క్రమం తప్పకుండా మందులు వాడాలి.
రక్తపోటు అనేది మనం మార్చుకునే జీవనశైలితోనే చాలా వరకు అదుపులోకి వస్తుంది. ముందస్తుగా బిపిని గుర్తించడం, సరైన జీవన విధానం, వైద్యుల సలహాలు పాటించడం ద్వారా ప్రమాదకర రోగాల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చని డాక్టర్లు చెపుతున్నారు.
