చిరంజీవి మెగాస్టార్ అయ్యారంటే దాని వెనక ఎంత కృష్టి పట్టుదల ఉందో అందరికి తెలిసిందే. ఇప్పటికీ అదే ఎనర్జీతో పనిచేస్తున్నాడు మెగా హీరో. 70 ఏళ్ల వయసులో నాన్ స్టాప్ గా 12 గంటలు షూటింగ్ అంటే మాటలా..?
సినీ పరిశ్రమలో వయసుతో నిమిత్తం లేకుండా, ఎప్పటికీ చెరగని ముద్ర వేసే కొద్దిమంది నటుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఏడు పదుల వయసులో కూడా ఆయనలోని ఉత్సాహం, అంకితభావం నేటి తరం యువ హీరోలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయి. వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న చిరంజీవి, ప్రస్తుతం తన 158వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ విశేషాలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
దర్శకుడు బాబీ కొల్లి నేతృత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా టాలీవుడ్ ప్రముఖ స్టంట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు. అయితే, ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం మెగాస్టార్ చూపించిన నిబద్ధత చూసి ఇండస్ట్రీ వర్గాలు అబ్బురపడుతున్నాయి.
వర్షం నేపథ్యంలో సాగే ఒక ఉత్కంఠభరితమైన పోరాట సన్నివేశం కోసం చిరంజీవి ఏకధాటిగా 12 గంటల పాటు షూటింగ్‌లో పాల్గొన్నారు. వయసును లెక్కచేయకుండా, అంతసేపు వర్షంలో తడుస్తూనే అత్యంత కఠినమైన యాక్షన్ మూమెంట్స్‌ను ఆయన అలవోకగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మెగాస్టార్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. నిత్యం ఉదయం 4 గంటలకే నిద్రలేచి వర్కవుట్స్ ప్రారంభించే ఆయన క్రమశిక్షణ, పని పట్ల చూపే శ్రద్ధ తమకు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయని చిత్ర బృందం పేర్కొంది. అందుకే ఆయన ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారని కొనియాడింది.
ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, అనశ్వర రాజన్ వంటి తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. . కమర్షియల్ హంగులతో, హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి పడుతున్న ఈ కష్టం చూస్తుంటే థియేటర్లలో ప్రేక్షకులకు మరోసారి కనువిందు ఖాయమనిపిస్తోంది.
