మలయాళ చిత్ర పరిశ్రమకే కాకుండా భారతీయ చిత్రసీమ అంతటికీ మెగాస్టార్ మమ్ముట్టి ఒక సరికొత్త ఫిట్నెస్ ఐకాన్‌గా నిలుస్తున్నారు. ఇటీవల 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ఆయన, ఇప్పటికీ ఎంతో యంగ్‌గా, ఉత్సాహంగా కనిపిస్తూ అభిమానులతో పాటు సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరంలో కండరాల బలం తగ్గుతుంది, కానీ ఈ వయసులోనూ ఆయన అంత హెల్తీగా ఉండటానికి కారణం ఆయన పాటించే కఠినమైన క్రమశిక్షణ, జీవనశైలి మాత్రమే.
పరిమిత ఆహారమే ప్రధాన సూత్రం
మమ్ముట్టి ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా ఒక ఇంటర్వ్యూలో ప్రశంసించారు. “మనకు నచ్చిన ఆహారాన్ని తినవచ్చు, కానీ కడుపు సగం నిండే వరకే తీసుకోవాలి.. పరిమితి దాటకూడదు” అని మమ్ముట్టి తనకు చెప్పిన విషయాన్ని సూర్య గుర్తు చేసుకున్నారు.
మమ్ముట్టి పాటించే డైట్ ప్లాన్ ముఖ్యమైన విశేషాలు:
మమ్ముట్టి కొన్ని పదార్ధాలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా పంచదార (షుగర్), నూనెలో వేయించిన పదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలకు ఆయన పూర్తిగా దూరంగా ఉంటారు. ఉదయం అల్పాహారంలోకి ఓట్స్ జావ, కోడిగుడ్డు తెల్లసొన, బొప్పాయి, నానబెట్టిన బాదం పప్పులు తీసుకుంటారు. మధ్యాహ్న భోజనంలో.. సాధారణ బియ్యం అన్నానికి బదులుగా ఓట్స్ పుట్టు, తక్కువ మసాలాతో వండిన చేపల కూర తింటారు. ఫ్రై చేసిన చేపల కంటే పులుసు కూరలనే ఆయన ఇష్టపడతారు. ఇక రాత్రి భోజనం మితంగా కంప్లీట్ చేస్తారు. గోధుమ లేదా ఓట్స్‌తో చేసిన దోశలు, చికెన్ లేదా చేపల కూరతో తేలికపాటి ఆహారాన్ని ముగిస్తారు.
క్రమం తప్పని వ్యాయామం, నిద్ర:
కేవలం మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా రోజువారీ జిమ్ వర్కౌట్లకు ఆయన ఎంతో ప్రాధాన్యమిస్తారు. శరీరం దృఢంగా ఉండటానికి కార్డియో వ్యాయామాలతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారు. వీటన్నింటితో పాటు సరిపడా నిద్ర కూడా శరీరానికి అంతే అవసరమని నమ్మే మమ్ముట్టి, షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యకరమైన అలవాట్లతో నేటి తరం నటులకు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న మమ్ముట్టి, తన 75వ పుట్టినరోజు సందర్భంగా ‘మేళా’ అనే కొత్త సినిమా పోస్టర్‌ను కూడా విడుదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు
