వెండితెరపై తనదైన నటనతో, హాస్యంతో ప్రేక్షకులను అలరించిన ఒకప్పటి సీనియర్ నటి పావలా శ్యామల జీవితం నేడు అత్యంత విషాదకర పరిస్థితిని ఫేస్ చేయాల్సి వస్తోంది. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆమెకు తాజాగా మరో ఘోర అవమానం ఎదురైంది. గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఆమెను, ఆమె కుమార్తె మాధవిని హైదరాబాద్లోని ఒక ప్రభుత్వ హాస్పిటల్ లో అనాథలుగా వదిలివెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆసుపత్రిలో వదిలివెళ్లిన అపరిచితులు
ఈ దారుణమైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఎర్రగడ్డలోని ప్రభుత్వ చెస్ట్ ఆసుపత్రి ప్రాంగణంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు పావలా శ్యామల, ఆమె కుమార్తెను నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆసుపత్రి ఆవరణలో దిక్కుతోచని స్థితిలో ఉన్న తల్లికూతుళ్లను గమనించిన అక్కడి సిబ్బంది వెంటనే స్పందించి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
వైద్య పరీక్షలు – ఉస్మానియాకు తరలింపు:
విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకు వైద్యులు వారికి అత్యవసరం వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రాథమికంగా వారికి క్షయ (టీబీ) పరీక్షలు చేయగా, అందులో నెగటివ్ అని తేలింది. అయినప్పటికీ, వారిద్దరికీ ఉన్న ఇతర వృద్ధాప్య, ఆరోగ్య సమస్యల దృష్ట్యా, మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం వారిని ఉస్మానియా సాధారణ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రి వద్ద హైడ్రామా.. రంగంలోకి పోలీసులు
ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందడానికి పావలా శ్యామల - ఆమె కుమార్తె ఇష్టపడలేదు. అక్కడ ఉండటానికి కష్టంగా ఉందని చెప్పారు. అంతే కాదు ఇద్దరు సాయంత్రానికి ఎవరికీ చెప్పకుండా తిరిగి ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రికే చేరుకున్నారు. వీరి పరిస్థితిని చూసి ఆందోళన చెందిన ఆసుపత్రి అధికారులు వెంటనే బోరబండ పోలీసులకు సమాచారం అందించారు.స్పందించిన పోలీసులు శుక్రవారం ఆసుపత్రికి చేరుకుని, తల్లికూతుళ్లను చివరకు కు స్థానిక అనాథాశ్రమానికి సురక్షితంగా తరలించారు. ఒకప్పుడు సినిమాల్లో నటిస్తూ ఎంతో మందికి వినోదాన్ని పంచిన నటి, నేడు అనాథగా ఆశ్రమంలో చేరడం చూసి సినీ అభిమానులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
