ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 75 ఏళ్ల వయసులో కూడా “సూపర్ స్టార్” గా వెలుగు వెలుగుతున్నాడు రజినీకాంత్ (Rajinikanth ). అయితే తెరపై కోట్ల మంది అభిమానులను అలరించే ఈ మహానటుడి అసలు పేరు రజినీకాంత్ కాదు. మహారాష్ట్రకు చెందిన ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ . నటిన మీద అమితాసక్తి.. ఎన్నో కష్టాలను ఎదురించి పేదరికంతోనే మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరారు.
బాలచందర్ కంట పడిన ప్రతిభ
ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థులు వేసిన ఒక నాటకాన్ని చూడటానికి అప్పటి దిగ్గజ తమిళ దర్శకుడు కె. బాలచందర్ వచ్చారు. ఆ నాటకంలో శివాజీరావు నటన, ప్రత్యేకంగా ఆయన సిగరెట్ విసిరేసి పట్టుకునే విలక్షణమైన స్టైల్ బాలచందర్‌ను విశేషంగా ఆకట్టుకుంది. శివాజీరావులోని నటుడిని గుర్తించిన బాలచందర్, వెంటనే ఆయనను పిలిపించి తన తదుపరి చిత్రం ‘అపూర్వ రాగంగళ్’ లో ఒక చిన్న పాత్రను ఆఫర్ చేశారు.
పేరు మార్చాల్సిన అవసరం ఎందుకొచ్చింది?
అయితే శివాజీరావును వెండితెరకు పరిచయం చేసే క్రమంలో బాలచందర్‌కు ఒక చిన్న సమస్య ఎదురైంది. అప్పటికే తమిళ చిత్రసీమలో ‘శివాజీ గణేషన్’ రూపంలో ఒక మహానటుడు ఉండటంతో, అదే పేరుతో ఈ కొత్త కుర్రాడిని పరిచయం చేస్తే జనాల్లోకి సరిగ్గా వెళ్లదని బాలచందర్ భావించారు. దాంతో కొత్త పేరు కోసం ఆలోచిస్తుండగా, బాలచందర్‌కు తాను గతంలో రాసిన ‘మేజర్ చంద్రకాంత్’ అనే నాటకం గుర్తుకొచ్చింది. ఆ నాటకంలో శ్రీకాంత్, రజినీకాంత్ అనే ఇద్దరు అన్నదమ్ముల పాత్రలు ఉంటాయి. అందులోని ‘రజినీకాంత్’ అనే పేరును శివాజీరావు కోసం బాలచందర్ ఎంచుకున్నారు.
రజిని కాంత్ అంటే అర్థం ఏంటి?
రజినీ అంటే చీకటి, కాంత్ అంటే కాంతి.. నల్లగా ఉండే ఈ కుర్రాడు వెండితెరపై ఒక వెలుగు వెలుగుతాడనే ఉద్దేశంతో బాలచందర్ ఈ పేరును ఖరారు చేశారు . అలా 1975 హోలీ పండుగ రోజున శివాజీరావు గైక్వాడ్ కాస్తా ‘రజినీకాంత్’గా మారారు. ఒక గురువు తన శిష్యుడికి పెట్టిన ఆ పేరు, తర్వాతి కాలంలో భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సంచలనంగా, ఒక పవర్ఫుల్ బ్రాండ్‌గా అవతరించింది .
