భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’ (Ramayana).నితీష్ తివారి(Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఇటీవల విడుదలై దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. అయితే, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చిత్రంలో సీతాదేవి పాత్ర పోషించిన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి లుక్‌పై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి స్పందిస్తున్నారు.
ట్రైలర్‌లో సీతాదేవి గెటప్‌లో కనిపించిన సాయి పల్లవిని చూసి కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. సాయి పల్లవి సాధారణంగా సహజ సిద్ధమైన నటనకు పెట్టింది పేరు అయినప్పటికీ, పౌరాణిక సీతాదేవి పాత్రకు ఉండాల్సిన రూపం ఆమెలో కనిపించడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ వంటి ఇతర హీరోయిన్లు కూడా ఉన్నారని ప్రస్తావిస్తూ, దర్శకుడు నితీష్ తివారి సాయి పల్లవిని సీతగా ఎంచుకోవడాన్ని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. సాయి పల్లవి కంటే ఆమె పక్కన ఉన్న చెలికత్తెల రూపమే బాగుందంటూ దారుణమైన ట్రోల్స్ చేశారు.
ఈ ట్రోల్స్‌పై సాయి పల్లవి(Sai Pallavi) అభిమానులు, పలువురు సినీ విశ్లేషకులు గట్టిగానే స్పందిస్తున్నారు. సీతాదేవి వంటి పవిత్రమైన పాత్రకు కేవలం గ్లామర్ ఉంటే సరిపోదని, పాత్రలోని గాంభీర్యాన్ని, భావోద్వేగాలను పండించగలిగే అద్భుతమైన అభినయం అవసరమని ఫ్యాన్స్ స్పష్టం చేస్తున్నారు. ట్రైలర్‌లో సాయి పల్లవి కనిపించిన తీరు చాలా ప్రశాంతంగా, పవిత్రమైన దివ్య భావనతో ఉందని, ప్రస్తుత తరంలో సీత పాత్రకు న్యాయం చేయగల ఏకైక నటి సాయి పల్లవి మాత్రమేనని అభిమానులు అంటున్నారు.
సొంత నటనతో ప్రేక్షకులను మెప్పించగల సాయి పల్లవిపై ఈ స్థాయి నెగెటివిటీ అన్యాయమని, రేపు సినిమా విడుదలయ్యాక ఆమె నటన చూసి ఇప్పుడు విమర్శించిన వారే ప్రశంసలు కురిపిస్తారని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ‘రామాయణ’ ట్రైలర్ ఒకవైపు అంచనాలను పెంచగా, మరోవైపు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హాట్ డిబేట్‌కు దారితీసింది.
