పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల, శారీరక, మానసిక వికాసంలో వారు ప్రతిరోజు తీసుకునే ఆహారం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఐదు సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లల జీర్ణవ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతూ చాలా సున్నితంగా ఉంటుంది. ఈ వయస్సులో తల్లిదండ్రులు ప్రేమతో తినిపించే కొన్ని ఆహార పదార్థాలు పిల్లల ఆరోగ్యానికి మేలు చేయకపోగా, వారి శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రముఖ వైద్యులు అందించిన ఆరోగ్య సూచనల ప్రకారం, 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఇవ్వకూడని 5 ప్రధాన ఆహారాల ఏంటో తెలుసా?
- ప్రాసెస్ చేసి ప్యాక్ చేసిన స్నాక్స్
ప్యాకెట్ చిప్స్, కుర్కురే, నమ్కీన్ మరియు ప్రాసెస్ చేసిన బిస్కెట్లలో అధిక మొత్తంలో సోడియం (ఉప్పు), ప్రిజర్వేటివ్‌లు , నాణ్యత లేని ప్రాసెస్డ్ నూనెలు ఉంటాయి. ఇవి చిన్న పిల్లల సున్నితమైన మూత్రపిండాల (Kidneys) పై భారాన్ని మోపడమే కాకుండా జీర్ణశయాంతర సమస్యలకు దారితీస్తాయి. - అధిక చక్కెర కలిగిన పానీయాలు (Sugary Beverages)
ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్‌లు, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ మరియు చక్కెర ఎక్కువగా ఉన్న షేక్‌లు పిల్లలలో చిన్న వయస్సులోనే ఊబకాయం (Obesity) వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేకాకుండా ఇవి పళ్ల పిప్పికి (Tooth Decay) కారణమవుతూ, వారి సహజమైన ఆకలిని తగ్గిస్తాయి. - చాక్లెట్లు – మైదా ఆధారిత ఆహారాలు
మైదాతో తయారుచేసిన కేకులు, బ్రెడ్, బిస్కెట్లు మరియు చాక్లెట్లు తరచుగా ఇవ్వడం వల్ల పిల్లలలో మలబద్ధకం (Constipation) సమస్య తలేత్తుతుంది. ఇవి కడుపు నిండిన భావనను కలిగించినప్పటికీ, ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందించవు. - జంక్ ఫుడ్ – ఫాస్ట్ ఫుడ్స్
నూడుల్స్, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఫాస్ట్ ఫుడ్స్ జీర్ణం కావడం చాలా కష్టం. వీటిలోని ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు రసాయనాలు పిల్లల రోగనిరోధక వ్యవస్థను (Immunity) బలహీనపరుస్తాయి. - కెఫిన్ – కృత్రిమ రంగులు ఉన్న పదార్థాలు
టీ, కాఫీ లేదా కృత్రిమ రంగులు (Artificial Colors) అధికంగా ఉండే క్యాండీలు పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు. కెఫిన్ వల్ల పిల్లల్లో నిద్రలేమి, చిరాకు మరియు పోషకాల శోషణ తగ్గే ప్రమాదం ఉంది.
తల్లిదండ్రులకు సూచన
పిల్లలకు బయట దొరికే ప్యాక్ చేసి ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా ఇంట్లో వండిన పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, తాజా పండ్లు మరియు పాలు వంటి సహజ పోషకాహారాన్ని అలవాటు చేయడం వారి భవిష్యత్తు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
