ప్రతిరోజూ ఉదయాన్నే టిఫిన్ (అల్పాహారం)లో గుడ్డు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు మరియు పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. గుడ్డులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అయితే, గుడ్డు తినేటప్పుడు చాలామందికి వచ్చే అతిపెద్ద సందేహం ఏమిటంటే — “ఉడకబెట్టిన గుడ్డు (Boiled Egg) మంచిదా? లేదా ఆమ్లెట్ (Omelette) మంచిదా?”. ఈ రెండింటిలో పోషకాల పరంగా, రోజువారీ ఆరోగ్యం పరంగా ఏది సరైన ఎంపికో వివరంగా తెలుసుకుందాం.
ఉడకబెట్టిన గుడ్డు ఉపయోగం ఏంటి?
సాధారణంగా బరువు తగ్గాలనుకునేవారు లేదా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపేవారు ఉడకబెట్టిన గుడ్డుకే ప్రాధాన్యత ఇస్తారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, గుడ్డును ఉడకబెట్టేటప్పుడు ఎలాంటి అదనపు నూనె గానీ, నెయ్యి గానీ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల గుడ్డులో అదనపు కేలరీలు లేదా కొవ్వు పదార్థాలు చేరవు. ఉడకబెట్టిన గుడ్డు జీర్ణ వ్యవస్థకు సులభంగా అబ్బుతుంది.
ఆమ్లెట్ ఎందుకు ప్రత్యేకమైనది?
చాలామంది ఆమ్లెట్ తినడం వల్ల నూనె చేరి బరువు పెరుగుతామని భావిస్తారు. కానీ, సరైన పద్ధతిలో తయారుచేసుకుంటే రోజువారీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఆమ్లెట్ ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన ఎంపికగా మారుతుంది.
ఆమ్లెట్ తయారుచేసేటప్పుడు అందులో ఉల్లిపాయలు, టమోటాలు, పాలకూర, పచ్చిమిర్చి, కాప్సికమ్ వంటి రకరకాల కూరగాయలను చేర్చుకోవచ్చు. దీనివల్ల గుడ్డులోని ప్రొటీన్లతో పాటు, కూరగాయల ద్వారా సమృద్ధిగా ‘ఫైబర్’ (పీచు పదార్థం) మరియు రకరకాల విటమిన్లు శరీరానికి అందుతాయి. ఆమ్లెట్లో కూరగాయలు మరియు పీచు పదార్థం కలవడం వల్ల ఇది తిన్న తర్వాత చాలా సమయం వరకు ఆకలి వేయకుండా, కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా ఉదయాన్నే అనవసరమైన జంక్ ఫుడ్ లేదా అధిక కేలరీల ఆహారం తినకుండా నిరోధించవచ్చు. చాలామంది పిల్లలు లేదా పెద్దలు ఉడకబెట్టిన గుడ్డు పచ్చసొన తినడానికి అంతగా ఇష్టపడరు. అటువంటి వారికి కూరగాయలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి సువాసనకరంగా చేసిన ఆమ్లెట్ ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారంగా మారుతుంది.
ఆరోగ్యకరమైన ఆమ్లెట్ ఎలా చేసుకోవాలి?
ఆమ్లెట్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దానిని తయారు చేసే విధానంపైనే దాని పోషక విలువ ఆధారపడి ఉంటుంది.ఆమ్లెట్‌ను ఎక్కువ నూనెలో వేయించకుండా, అతి తక్కువ ఆలివ్ ఆయిల్ లేదా కొద్దిగా నెయ్యి ఉపయోగించాలి.ప్రాసెస్ చేసిన చీజ్, బటర్ వంటి వాటిని పరిమితంగా లేదా పూర్తిగా దూరం పెట్టడం మంచిది. వీలైనంత ఎక్కువ కూరగాయలను జోడించడం వల్ల పీచు పదార్థం లభిస్తుంది.
పైనల్ గా…
ఉడకబెట్టిన గుడ్డు మరియు ఆమ్లెట్ రెండూ కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవే. అయితే, మీరు కేవలం తక్కువ కేలరీల ఆహారాన్ని మాత్రమే కోరుకుంటుంటే ఉడకబెట్టిన గుడ్డు మంచిది. కానీ మీ ఆహారంలో ప్రొటీన్‌తో పాటు ఫైబర్ (పీచు పదార్థం), విటమిన్లు చేర్చి ఒక పరిపూర్ణమైన బ్రేక్‌ఫాస్ట్ పొందేందుకు తక్కువ నూనెతో కూరగాయలు కలిపి చేసే ఆమ్లెట్ ఎంతో సరైన, అత్యుత్తమ ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు.
