ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో “అది తినొద్దు, ఇది తాగొద్దు” అని వైద్యులు ఇచ్చే సలహాలు విని చాలామంది అయోమయానికి గురవుతుంటారు. షుగర్స్, రిఫైన్డ్ ఆయిల్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్ మానేస్తే అసలు రోజువారీ జీవితంలో ఏవి తినాలి? అనే ప్రశ్న చాలామందిలో మెదులుతుంది. దీనిపై డాక్టర్స్ ఏం చెపుతున్నారో తెలుసా. ఇంట్లో దొరికే సాదాసీదా ఆహార పదార్థాలతోనే ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు (Healthier Alternatives) ఎంచుకోవచ్చు.
- పంచదారకు అసలైన ప్రత్యామ్నాయం ఏంటి?
చాలామంది తెల్ల పంచదార (White Sugar) స్థానంలో బ్రౌన్ షుగర్, తేనె లేదా బెల్లం వాడటం ఆరోగ్యానికి మంచిదని భావిస్తుంటారు . అయితే, పేర్లు ఏవైనా ఇవన్నీ కూడా చక్కెర శాతాన్ని కలిగి ఉండేవే. కాబట్టి, వైట్ షుగర్‌కి ఉత్తమమైన రీప్లేస్‌మెంట్ ఏంటంటే “ఏదీ వాడకపోవడమే”. అనవసరంగా షుగర్స్ తీసుకోవడం ఆపేయడమే శరీరానికి అత్యంత క్షేమకరం. స్వీట్ తినాలనిపించినప్పుడు (Sweet Cravings) కృత్రిమ తీపికి బదులుగా ఒకటి లేదా రెండు ఖర్జూరాలు (Dates) లేదా 4-5 ఎండు ద్రాక్షలు (Raisins) తీసుకోవడం మంచిదని నిపుణులు చెపుతున్నారు. - వంట నూనెల ఎంపికలో జాగ్రత్తలు:
వంటల్లో ఏ రకమైన నూనె వాడాలనే దానిపై ఎప్పుడూ పెద్ద చర్చే జరుగుతుంటుంది. ప్రాసెస్ చేసిన రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా గానుగ నూనెలు లేదా వుడ్ ప్రెస్డ్/కోల్డ్ ప్రెస్డ్ (Cold-pressed / Wood-pressed Oils) ఆయిల్స్ వాడటం 1000 రెట్లు మేలైనదని తెలిపారు. అయితే, అది హెల్తీ ఆయిల్ అయినంత మాత్రాన పరిమితి లేకుండా వాడకూడదని, వంటల్లో ఎంత తక్కువ నూనె ఉపయోగిస్తే అంత ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. - ప్యాకేజ్డ్ స్నాక్స్ & కూల్ డ్రింక్స్‌కు ప్రత్యామ్నాయాలు:
బజార్లో లభించే చిప్స్, బిస్కెట్లు, మిక్చర్, నూడుల్స్ వంటి ప్యాకేజ్డ్ జంక్ ఫుడ్స్‌కు బదులుగా మన ఇంట్లోనే లభించే పోషకాహారాన్ని ఎంచుకోవచ్చు.
చిప్స్/మిక్చర్ బదులు: వేయించిన శనగలు, పల్లీలు (వేరుశనగలు) లేదా మకానా (Phool Makhana) తీసుకోవడం శరీరానికి మంచి ప్రోటీన్, ఫైబర్ అందిస్తుంది.
మ్యాగీ/నూడుల్స్ బదులు: ఇన్స్టంట్ నూడుల్స్ తినాలనిపించినప్పుడు అటుకుల ప్రసాదం/పోహా (Poha) తయారుచేసుకుని తినడం ఉత్తమం.
కూల్ డ్రింక్స్ బదులు: ఆర్టిఫిషియల్ షుగర్ ఉండే సాఫ్ట్ డ్రింక్స్‌కు దూరంగా ఉంటూ నిమ్మరసం (Lemon Juice), లస్సీ లేదా కొబ్బరిబోండం నీళ్లు (Coconut Water) తాగడం వల్ల శరీరం రీహైడ్రేట్ అవుతుంది .
ఈ మార్పులన్నీ చేయడానికి ఏవో ఖరీదైన ఫ్యాన్సీ ఫుడ్స్ అవసరం లేదని, మన కిచెన్లలో సులభంగా లభించే పదార్థాలతోనే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.
