పిల్లల పెంపకం అనేది కేవలం వారికి మంచి ఆహారం, చదువు అందించడమే కాదు; వారి ఎదుట మనం ఎలా ప్రవర్తిస్తున్నామనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. పిల్లలు మనం చెప్పే మాటల కంటే మనం చేసే పనులను చూసే ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు. అందుకే వారి సున్నితమైన మనస్సులపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేందుకు, పిల్లల ముందు తల్లిదండ్రులు కొన్ని పనులకు దూరంగా ఉండాలి.
దంపతుల గొడవలు – అరుచుకోవడాలు:
పిల్లల ఎదుట భార్యాభర్తలు కోపంతో గొడవపడటం, బిగ్గరగా అరుచుకోవడం లేదా దూషించుకోవడం చేయకూడదు. దీనివల్ల పిల్లలలో భయం, మానసిక ఆందోళన పెరుగుతాయి. వారు భద్రతా భావాన్ని కోల్పోతారు.
ఇతరులను విమర్శించడం:
ఇంటికి వచ్చే బంధువులు, పొరుగువారు లేదా స్నేహితుల గురించి పిల్లల ముందే ప్రతికూలంగా మాట్లాడటం లేదా విమర్శించడం తప్పు. దీనివల్ల పిల్లలలో కూడా ఇతరులను తక్కువ చేసి మాట్లాడే అలవాటు పెరుగుతుంది.
నిరంతరం స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు చూడటం:
తల్లిదండ్రులు రోజంతా ఫోన్‌లలో మునిగిపోతూ, పిల్లలను మాత్రం “ఫోన్ చూడకండి, చదువుకోండి” అని చెబితే వారు వినరు. మనం చేసే పనులనే పిల్లలు అనుకరిస్తారు.
శారీరక లేదా మానసిక హింస:
కోపంలో పిల్లలను తీవ్రంగా కొట్టడం, అసభ్య పదజాలం ఉపయోగించడం లేదా ఇతరులపై చేయి చేసుకోవడం వంటివి వారిలో హింసాత్మక ప్రవర్తనను పెంచుతాయి.
పిల్లల మధ్య పోలికలు
“ఆ బాబుని చూడు ఎంత బాగా చదువుతున్నాడో, నువ్వు దేనికీ పనికిరావు” అంటూ ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడటం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.
అబద్ధాలు చెప్పడం:
పిల్లల ముందే చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు చెప్పడం వల్ల, అబద్ధం చెప్పడం తప్పు కాదనే భావన వారిలో బలపడుతుంది. పిల్లల ముందు మనం ప్రదర్శించే ప్రవర్తనే వారి వ్యక్తిత్వానికి పునాది. తల్లిదండ్రులు ఇంట్లో ప్రశాంతమైన, ప్రేమపూర్వకమైన మరియు గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించినప్పుడే పిల్లలు మానసికంగా దృఢంగా, ఆరోగ్యకరమైన ఆలోచనలతో ఎదుగుతారు. మన ప్రవర్తనయే పిల్లలకు మొదటి పాఠశాల అని గుర్తుంచుకోవాలి.
