మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామనేది ఎంత ముఖ్యమో, భోజనం చేసిన తర్వాత అనుసరించే అలవాట్లు కూడా మన ఆరోగ్యానికి అంతే ముఖ్యం. సాధారణంగా చాలామందికి భోజనం ముగించిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం, నిద్రపోవడం లేదా స్నానం చేయడం వంటి అలవాట్లు ఉంటాయి. అయితే, మనం అనాలోచితంగా చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లు జీర్ణక్రియపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం తర్వాత అస్సలు చేయకూడని 5 ముఖ్యమైన పనులు ఏంటో తెలుసా?
- తిన్న వెంటనే పళ్ళు తోమడం (Teeth Brushing)
ఆహారం తిన్న వెంటనే బ్రష్ చేసుకోవడం వల్ల పండ్లపై ఉండే రక్షణ పొర (Enamel) దెబ్బతింటుంది. ఆహారంలోని ఆమ్లాల వల్ల ఎనామిల్ సున్నితంగా మారడం ఇందుకు కారణం. కాబట్టి భోజనం తర్వాత కనీసం 30 నిమిషాల గ్యాప్ ఇవ్వడం మంచిది. - వెంటనే స్నానం చేయడం (Shower)
భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత మారి, రక్త ప్రసరణ జీర్ణశయం వైపు కాకుండా చర్మం ఉపరితలానికి మళ్లుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగించి, కడుపు ఉబ్బరం లేదా అజీర్తి సమస్యలు వస్తాయి. - భోజనం ముగించగానే పండ్లు తినడం (Fruits)
పండ్లు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమైనప్పటికీ, భోజనం చేసిన వెంటనే తినడం సరికాదు. ఆహారంతో పాటు పండ్లు తింటే అవి జీర్ణాశయంలో నిలిచిపోయి పులియబెట్టడం (Fermentation) వల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటీ తయారవుతాయి. - హెవీ మీల్ చేసిన వెంటనే పడుకోవడం (Sleeping)
కడుపు నిండా తిన్న వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ (Acid Reflux) సమస్య వస్తుంది. జీర్ణరసాలు గొంతులోకి రావడం వల్ల గుండెల్లో మంట ఏర్పడి నిద్రకు భంగం కలుగుతుంది. - వెంటనే టీ లేదా కాఫీ తాగడం (Tea or Coffee)
భోజనం చేసిన వెంటనే టీ/కాఫీ తాగడం వల్ల అందులోని టానిన్లు (Tannins) ఆహారంలోని ఐరన్ (ఇనుము) మరియు ఇతర ముఖ్య పోషకాలు శరీరానికి అందకుండా అడ్డుకుంటాయి.
భోజనం చేసిన తర్వాత కనీసం 15 నుండి 30 నిమిషాల గ్యాప్ ఇచ్చి మెల్లగా నడవడం లేదా విశ్రాంతి తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. రోజువారీ జీవితంలో ఈ చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
