మన దేశంలో ప్రసిద్ధి చెందిన స్ట్రీట్ ఫుడ్స్ అనగానే అందరికీ మొదటగా గుర్తుకొచ్చేది పానీపూరీ. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ పానీపూరీని ఎంతో ఆస్వాదిస్తూ తింటారు. అయితే, చాలామంది దీనిని అనారోగ్యకరమైన “జంక్ ఫుడ్” అని భావిస్తుంటారు. కానీ సరైన పద్ధతిలో, పరిశుభ్రంగా తయారుచేసుకుంటే పానీపూరీ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారమని నిపుణులు తెలుపుతున్నారు.
జీర్ణక్రియను మెరుగుపరిచే పదార్థాలు
పానీపూరీలో ఉపయోగించే పానీ తయారీకి పుదీనా, జీలకర్ర తో పాటు నల్ల ఉప్పు (Black Salt) వాడతారు. పుదీనా చలవ చేయడంతో పాటు జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. జీలకర్ర మరియు నల్ల ఉప్పు కడుపుబ్బరం (Bloating), గ్యాస్ మరియు అజీర్తి వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. కానీ వీటిని కలపడమే పరిశుబ్రమైన పరిస్థితుల్లో కలిపితే మంచిది.
విటమిన్-సి సమృద్ధిగా లభించడం
పానీపూరీ పానీలో నిమ్మరసం, చింతపండు, కొత్తిమీరను విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇవి శరీరానికి కావలసిన విటమిన్-సిని సమృద్ధిగా అందిస్తాయి. విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
అధిక ప్రోటీన్ – ఫైబర్
పూరీ లోపల పెట్టే స్టఫ్ఫింగ్ (Filling) లో కేవలం బంగాళాదుంపలు (Aloo) మాత్రమే కాకుండా నానబెట్టిన లేదా ఉడకబెట్టిన శనగలు (Chickpeas), పెసర్లు (Moong Dal), లేదా మొలకెత్తిన విత్తనాలను (Sprouts) కూడా వాడుతారు. వీటి వల్ల శరీరానికి సమృద్ధిగా పీచు పదార్థం (Fiber) తో పాటు ప్రోటీన్ లభిస్తాయి
పానీపూరీ తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పానీపూరీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, తినేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి బయట బండ్ల మీద తినేటప్పుడు ఆ ప్రదేశం , నీటి శుభ్రతను ఖచ్చితంగా గమనించాలి. వీలైతే ఇంట్లోనే పరిశుభ్రంగా తయారు చేసుకుని తినడం శ్రేయస్కరం. పూరీలను సాధారణంగా మైదాతో తయారుచేస్తారు కాబట్టి, అతిగా కాకుండా పరిమిత పరిమాణంలో (Limited quantity) తీసుకోవాలి. తియ్యటి పానీలో చక్కెర లేదా బెల్లం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తీపి పానీని తగ్గించి, పుదీనా-జీలకర్రతో చేసిన ఘాటైన పానీని ఎంచుకోవడం మంచిది. పరిశుభ్రమైన వాతావరణంలో, పరిమితంగా తీసుకుంటే పానీపూరీ ఆరోగ్యకరమైన రుచికరమైన స్నాక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు
